అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13734)

ఆయనే దేవుడు.  
	ఓయీ ఊర్ధ్వగణ పరివృత పావనసీమకు ఆరాధనా భావయుతుడవై పరిభ్రమణ మొనరించు వాడా! నిజైకదైవ సింహద్వారసీమ యెదుట కృతజ్ఞతతో కరములనెత్తి వచియింపు మిటుల: మహాభి మాను లెల్లరి పరమాభిలాషా! దారిదప్పి చరియించు యెల్లరకును దివ్యమార్గదర్శీ! ఈ నిస్సహాయభృత్యునికి నీ యనంతాశీస్సుల ననుగ్రహించి, ఇ య్యదృష్టహీనుని, ఈ యధముని నీ యేకేశ్వరత్వ దివ్యద్వారమునకు నడిపినావు. ఈ శుష్కితయధరములకు నీ మృదుకారుణ్య జీవజలము నొసగి, అలసి సొలసిన ప్రాణమును దివ్యకారుణ్య మందమారుతములతో పునర్జీవిత నొనరించినావు. నాకు నీ మహౌదార్యానుగ్రహ పూర్ణభాగము నొసగి, నీ పావన సింహద్వారప్రాప్తి నొందు మాన్యతతో న న్ననుగ్రహించినందులకు నీకు ధన్యవాదముల నర్పింతును. నీ విభవ సామ్రాజ్యాశీస్సులయం దంచిత సంవిభాగమునకై యర్ధింతును. నీ సాహాయ్యము ననుగ్రహింపుము. నీ దయాపూర్ణానుగ్రహమును ప్రసాదింపుము.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13735)

ఓ అజ్ఞాతహితుడా! ప్రకృత ప్రపంచ, ఆగామి ప్రపంచవాసు లెల్లరి యపేక్షా! ఓ అనుకంపాన్విత ప్రియతమా! ఈ నిస్సహాయులు నీ ప్రేమకు సమాకర్షితులు; ఈ దుర్బలురు నీ సింహద్వారాశ్రితులు. నీ యెడబాటునకు వారు ప్రతి రాత్రియు నిట్టూర్చుచూ, మూల్గుచూ యున్నారు; దుర్జనుల దురాక్రమణల కతమున ప్రతి ఉదయమునను దుఃఖింపుచూ, రోదన సేయుచున్నారు. క్షణమున కొక నూతన వ్యధచే వేధింపవడుచున్నారు; అనుక్షణమూ దుష్టదురితుల క్రౌర్యమునకు గురి యగుచున్నారు. అయినను, అగ్నిదేవళము వలె వారు ప్రజ్జ్వలింపుచూ, సూర్యచంద్రులవలె విరాజిల్లుచున్నందులకు ప్రకీర్తితుడ వీవు. వారు భగవంతుని దివ్యధర్మమున యూర్ధ్వీకృత ధ్వజమువలె నిలిచి, సాహసాశ్వికులవలె రంగప్రవేశమునకు వేగిర పడుచున్నారు. సుందర సుమములవలె వికసించి, హసియించు గులాబివలె వా రానందభరితులైనారు. కావున, ఓ సాదర ప్రదాతా, నీ దివ్యసామ్రాజ్య ప్రసాదితమైన నీ దివ్యానుగ్రహముచే, కృపతో యీ పుణ్యాత్ములకు సహకరించి, పరమోన్నతుని చిహ్నములను ప్రదర్శించునటుల యీ పావనజీవనుల ననుగ్రహింపుము. నీవు సకలౌదార్యుడవు, కరుణాన్వితుడవు, సకల దయామయుడవు, ఆనుకంపాన్వితుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13736)

ఓ అప్రమేయ, ప్రేమాస్పద విభో! యోగ్యతాసామర్ధ్యములు కొఱవడినను, సంకటముల నెదిరించుట బహుదుర్లభమైనను, సామర్థ్యయోగ్యతా పురస్కృతుల నొసంగినాడవు. ఓ ప్రభూ! మే మనంతస్థైర్యమును ప్రదర్శించి, ఈ జగత్తును, తత్ప్రజాసమస్తమును పరిత్యజించి, నీ ప్రేమాగ్నిని రగిలించి, దహియించు జ్వాలతో, క్రొవ్వొత్తులవలె తేజోమయులమై జ్వలించి, మా తేజమును దూరభూములకు పరివ్యాప్తము సేయు సామర్ధ్యము నొసంగి, మమ్ము యోగ్యులను గావింపుము. 
 
	ఓ దివ్యసామ్రాజ్యవిభుడా! ఈ నిష్ఫల మాయామోహ ప్రపంచమునుండి మమ్ము విముక్తులను గావించి అనంతలోకమునకు నడిపింపుము. మమ్ముల నీనిమ్నజీవనమునుండి సంపూర్ణముగా విముక్తులను గావించి, దివ్యసామ్రాజ్య పురస్కృతులను బడయజేయుము. ఈ సత్యాభాస విభ్రమకారక లోకమునుండి మాకు ముక్తి నొసగి, అనంతజీవనము ననుగ్రహింపుము. మాకు హర్షోల్లాసములను ప్రసాదించి, ప్రమోదసంతుష్టతలను దయసేయుము. మా మనస్సులకు సాంత్వన నిచ్చి, మా యాత్మలకు శాంతిసౌఖ్యముల నిమ్ము, తద్వారా నీ దివ్యసామ్రాజ్యమున కధిరోహించిన యంత, నీ సాన్నిధ్యము నొంది యూర్థ్వలోకముల యందున సమ్మోదము నొందుదుము. నీవు దాతవు, ప్రదాతవు, సర్వశక్తియుతుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13737)

ఓ నా అమరప్రియతమా, నా ఆరాధ్యమిత్రమా! నీ సాన్నిధ్య విహీనుడనై, నీ యెడబాటుతో తీవ్రవ్యాకులుడనై యెన్నినా ళ్లుండవలె? నన్ను నీ పవిత్ర సామ్రాజ్యాశ్రయమునకు నడిపించి, నాపై నీ యూర్ధ్వ లోకసాక్షాత్కారఘట్టమున నీ మృదుకారుణ్యదృష్టిని సారింపుము.   
 	సర్వశక్తిమంతుడవైన ఓ ప్రభూ! నన్ను దివ్యసామ్రాజ్యవాసుల యందున గణియింపుము. నా యావాస మీనశ్వర ప్రపంచము; స్థితిరహిత లోకములయం దొక గేహమును నా కనుగ్రహింపుము. ఈ ధరాతలనివాసిని నేను; నీ మహిమాన్విత సుప్రకాశ తేజోదీప్తిని నాపై కురియింపుము. ఈ ధూళిప్రవంచవాసిని నేను; నన్ను నీ స్వర్లోక వాసిని గావింపుము, తద్వారా  నా జీవితమును నీ పథమున కర్పించి నా మనోభీష్టము దీర్చుకొని, నా మస్తకముపై దివ్యానుగ్రహ మకుటమును ధరియించి, ‘ఓ దైవమహిమా, మహామహిమాన్వితా' యని విజయధ్వానము నొనరింతును.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13738)

ఓ దయాన్విత వల్లభా! సమావిష్టులైన వీరు, నీ ప్రేమతో పారవశ్యము నొందిన భవదీయ మిత్రులు. వారు నీ సౌందర్యమయూఖ ముగ్ధులు, నీ కస్తూరీవిలేపిత కేశపాశసమాకర్షితులు. వారు తమ హృదయములను నీ కర్పించి, నిమ్నులై, నిస్సహాయులై, నీ పథమున చరియింపుచున్నారు. శత్రుమిత్రుల నొక్కతీరుననే విడనాడి, వా రారాధనాపూర్వకముగ నీ మ్రోలన వినమ్రులగుచు, నీ యేకత్వమును  విశ్వసించినారు
వా రీయధోలోకవాసులు; నీ దివ్యసామ్రాజ్యములోనికి వారల నాహ్వానించినావు. వారు అభాగ్యతావిహీనతల కాననమున వడలిన మొక్కలవంటి వారు; వారిని నీ జ్ఞానావగాహనోద్యానపు టంకురములను గావించినావు. వారి స్వరములు మూగవోయినవి; వారిని భాషింప జేసినావు. వారు నిస్తేజులు; తేజమును వారిపై ప్రసరించినావు.  బీటలు వారిన బీడుభూమి వలె వా రుండినారు; అంతర్భావయుత గులాబీవనముగ వారిని మార్చినావు. వారు మానవప్రపంచమున పసివారలై యుండినారు;  వారిని దివ్యపరిపక్వతా సమన్వితులను గావించినావు. 
 	ఓ దయామయా! నీ రక్షణాశ్రయమున వారల కావాసమును, శరణమును ప్రసాదించి, విచారణ నుండియు,  విపత్తు నుండియు వారిని రక్షింపుము.  నీ యగోచరోపకారమును వారల కొనరించి, నీ యమోఘకృప ననుగ్రహింపుము.
 
	ఓ దయాన్విత, ప్రియతమ విభుడా! దేహసదృశులు వారు, జీవాత్మవు నీవు.  దేహము తన నవ్యతాసౌందర్యములకై  యాత్మ కటాక్షముపై యాధారపడును.  కావుననే, ఈ నవ్యదివ్యావిష్కరణమున వారు నీ యాశీస్సుల యావశ్యకత నొందియుండి,  పవిత్రాత్మ యఖండ శక్తి నాకాంక్షింపుచున్నారు. మహనీయుడ వీవు. నీవు దాతవు, ప్రదాయకుడవు, అనుగ్రహశాలివి, క్షమాశీలివి. అగోచర దివ్యలోకము నుండి సముజ్జ్వలముగ తేజరిల్లు దివ్యుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13739)

ఓ దివ్యవిధాతా! దుష్కర క్లేశములు తలయెత్తినవి, విపత్కర విఘ్నములు దాపురించినవి.  ఓ ప్రభూ! ఈ క్లేశములను రూపుమాపి, నీ శౌర్యపరాక్రమ నిదర్శనములను ప్రదర్శింపుము. ఈ కడగండ్లను శమింపజేసి, ఈ విపత్కరపథమున మా దారిని సుగమము గావింపుము. ఓ దివ్యవిధాతా! అవాంతరము లణగుట లేదు, ఆయాస ప్రయాసములు వేనవేల వైరుధ్యసమ్మిళితము లైనవి. నీవు దక్క సాహాయ్యుడు లేడు, నిను వినా సంరక్షకుడు లేడు. మా యాశల నన్నింటినీ నీ మీదనే నిలిపి, మా సమస్త వ్యవహారములనూ నీ యధీన మొనరింతుము. నీవు దివ్యమార్గదర్శివి, సకల విపన్నివారకుడవు, విజ్ఞుడవు, వీక్షకుడవు, శ్రోతవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13740)

ఓ కరుణాన్విత దైవమా! ఓ సర్వశక్తిమంతుడా! నేను దుర్బల సేవకుడను, బలహీనుడను, నిస్సహాయుడను; అయినను నీ దాక్షిణ్యానుగ్రహ రక్షణమున సంరక్షితుడనై, నీ కారుణ్యవక్షమున పోషితుడనై,  నీ  ప్రేమాన్విత హృదయమున పరిపోషితుడ నైతిని. ఓ ప్రభూ! నేను నిరుపేదనే, అభ్యాగతినే; అయిననూ, ప్రతి నిరుపేదయూ నీ వదాన్యతచే భాగ్యశాలి గావింప వడుచుండ, ప్రతి సంపన్నుడూ, నీ యనుగ్రహవిహీనుడయ్యెనేని, నిక్కముగ నిరుపేదయే, దుఃఖభాజనుడే యగును. 
 	ఓ దివ్యవిధాతా! ఈ పెనుభారమును వహియించు శక్తిని నా కనుగ్రహింపుము, న న్నీయుత్కృష్టానుగ్రహమును పరిరక్షింపనిమ్ము; పరీక్షల యుధృతి యెంతటి దృఢమనిన, విపత్తుల యఘాత మెంతటి భీషణమనిన ప్రతి కొండయూ శకలములై మంటి పాలైనది, సమున్నత గిరిశృంగము నిశ్శేషమైనది. నీ స్మరణమును దక్క  నా హృదయమున అన్యము నాశింపనని పరిపూర్ణముగా యెఱుగుదువు; నీ ప్రేమను దక్క  నా మానసమున అన్యము నాశింపను. నీ ప్రేమికులను సేవించుటకు న న్నుద్యుక్తుని గావింపుము, నీ సింహద్వారసీమన సేవాభావనతో నిత్యనివాస ముండనిమ్ము. ప్రేమాస్పదుడ వీవు.  బహుళానుగ్రహవిభుడ వీవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13741)

ఓ దివ్యవిధాతా! నన్ను జాగృతుం జేసి, సచేతనుని గావింపుము. నీవు దక్క  సమస్తము నుండియు విముక్తుం జేసి, నీ సౌందర్యానురాగబద్ధుని గావింపుము. నాపై పరమాత్మ పవనమును ప్రసరిల్ల జేసి, అభా దివ్యసామ్రాజ్యామంత్రణమును న న్నాలింపనిమ్ము.  దివ్యశక్తిని నా కనుగ్రహించి, నా హృదయాంతరాళమున యాత్మజ్యోతిని ప్రజ్జ్వలిత మొనరింపుము. నీ సమ్మోదము దక్క  అన్యకామితము నుండనీయక, నీ వదనమును వినా అన్యము నాశింపక, నన్ను నీ పథమున దక్క  వేరొండు పథమున  పయనింప కుండునటుల  సకలబంధవిముక్తుని, సర్వవ్యామోహముక్తుని గావింపుము.  ప్రమత్తుల నప్రమత్తులను జేసి, సుషుప్తులను జాగృత మొనర్చునటుల, తీవ్ర దాహార్తులకు జీవజలము నొసంగి, అస్వస్థతారుగ్మతాయుతులకు దివ్యౌషధము నిచ్చునటుల న న్ననుగ్రహింపుము.
	నే నధముడను, హీనుడను, అల్పుడను, అయినను నీవే నా ఆశ్రయము, నా శరణ్యము; నా పోషకుడవు, నా యుపకారివి. సర్వులును సంభ్రమము నొందునటుల నాకు నీ సాహాయ్యము ననుగ్రహింపుము.  ఓ దేవా, నిక్కముగా నీవు సర్వశక్తిమంతుడవు, మహాధిపతివి, దాతవు, ప్రదాతవు, సర్వసాక్షివి.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13742)

ఆయనే దేవుడు
 
	ఓ దేవా, నా దేవా! నేను నీ కభిముఖుడను; నీ చికిత్సా సంద్రపు వెల్లువకై  ప్రార్థింతును.  ఓ ప్రభూ, నీ జనులను సేవించుటకును,  వారికి చికిత్స జేయుటకును కృపతో నాకు సాహాయ్య మొనరింపుము. నాకు తోడ్పడితివేని, నే జేయు నివారణోపాయము ప్రతి రుగ్మతకును నివారణౌషధమై, ప్రతి తీక్ష్ణదాహార్తికిని జీవజలబిందువై, ఆరాటవడు హృదయమున కుపశమన లేపనమగును. నాకు దోడ్పడ కున్నచో, అదియే సంక్షోభమై, నే నెవ్వరకును స్వస్థత జేకూర్పజాలను.
 	ఓ దేవా, నా దేవా! నీ రుజానివారణాశక్తితో నాకు తోడ్పడి, సహకరింపుము.  నిక్కముగా నీవు చికిత్సకుడవు, సంతుష్ట ప్రదాయకు డవు, సకల వేదనాజాడ్య నివారకుడవు, సమస్తపాలనావిభుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13743)

ఓ ప్రభూ! నా జీవితదివసముల యవసానము తదారంభమున కన్నను విలక్షణత నొందునటుల, నా జీవితచరమాంకము నీ బహువిధాశీస్సుల ద్వారములను దెఱచునటుల, నాకు నీ యనుగ్రహాన్విత కారుణ్యముల, నీ యాదరణా సంరక్షణల, నీ యాశ్రయౌదార్యములయం దొక వంతును ప్రసాదింపుము. నీ సాదర దాక్షిణ్యౌదార్యము లనుక్షణమును నా కనుగ్రహీతములగు గాక, నీ యూర్ధ్వీకృత ధ్వజపతాకచ్ఛాయన సకలశ్లాఘితుని దివ్యసామ్రాజ్యమునకు నేను మరలు నందాక,  ప్రతి నిశ్వాసమునను నీ క్షమాకారుణ్యములు నాకు ప్రసాదితములగు గాక. నీవు ప్రదాతవు, నిత్యప్రేమికుడవు; నిక్కముగా దయానుగ్రహాధీశుడ వీవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13744)

ఓ ప్రదాతా, ఓ క్షమాదాతా! ధన్యజీవి యొక్కడు దివ్యసత్య సామ్రాజ్యమున కధిరోహించి, ఐహిక ధూళీప్రపంచమునుండి నిత్యవైభవ లోకమునకు వేగిరపడనైనది. ఇప్పు డరుదెంచిన యతిధి స్థానమును సముద్ధరింపుము; నవీనాద్భుత చేలముతో యీచిరకాల సేవకు నలంకరింపుము.

 	ఓ అప్రమేయ ప్రభూ! ఈ యాత్మ నీ మార్మికాశ్రయములోనికి ప్రవేశించి, తేజోమయుల సందోహమునం దాత్మీయ సాహచర్యము నొందునటుల నీ క్షమాదరణములను ప్రసాదింపుము.  నీవు దాతవు, ప్రదాతవు, నిత్యప్రేమికుడవు. నీవు క్షమాశీలివి, ఆర్ద్రహృదయుడవు, మహాశక్తిశాలివి.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13745)

ఆయనే దేవుడు 
 
	క్షమాశీలివైన ఓ ప్రభూ! ధన్యజీవు లీసేవకులు; వీరు నీ మార్గదర్శనదీప్తిచే సుప్రకాశితులు, జ్యోతిర్మయులు. పూర్ణచషకమునుండి నీ యనురాగమధువును గ్రోలి, నీ జ్ఞానమధురగీతికా పరివ్యాపితములైన యనంతమర్మముల నాలించినారు. వీరు తమ హృదయములను నీ కర్పించి, వైమనస్యపాశవిముక్తులై నీ యేకత్వము ననుసరించినారు. ఈ యుత్తములను స్వర్లోకవాసులకు సహచరులను జేసి, నీ సన్నిహితుల వర్గమున జేరనిమ్ము. నీ యూర్ధ్వలోకస్థిత మర్మములకు వారిని సుపరిచితులను జేసి, జ్యోతిఃసాగరమున నిమజ్జనులను గావింపుము. నీవు ప్రదాతవు, ప్రదీప్తుడవు, ప్రసన్నుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13746)

ఓ దివ్యవిధాతా! ఈ నీ ద్వారసీమదాసుని  జననీజనకులను నీ క్షమాంబుధిన నిమజ్జన మొనరించి, సమస్త దుష్కృతోల్లంఘనముల నుండియు వారిని ప్రక్షాళించి, పవిత్రులను జేయుము. నీ క్షమాకారుణ్యములను వారల కనుగ్రహించి, దయతో మన్నింపుము. నిక్కముగా, నీవు క్షమాశీలివి, నిత్యక్షమాపకుడవు, అనంతానుగ్రహ ప్రదాయకుడవు. ఓ సహిష్ణుతాధిపా! పాపాత్ములమైననూ, మా యాశలను నీ వాగ్దానాభయప్రదానములపై నిల్పినాము. అపరాధ తిమిరావృతులమైననూ, మా వదనములను సర్వకాలముల యందునను నీ యౌదార్యాన్వితానుగ్రహముల ప్రాతఃసమయము దెసకు మరలించినాము. నీ దివ్యద్వారసీమోచితముగ మాతో వ్యవహరించి, నీ దివ్యాస్థాన సముచితమును మా కనుగ్రహింపుము. నీవు నిత్యక్షమాశీలివి, సహనుడవు, సర్వదోషసైరివి.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13747)

ఓ దయాన్విత వల్లభా! సమస్తానుబంధముల నుండియు నా మనస్సును పునీత మొనరింపుము. ఆనందోపదేశముతో నా యాత్మను సంతసింపజేయుము. పూర్ణముగ నీకు వశుడనై, అత్యుత్సాహపరవశుడ నగునటుల; నినువినా అన్యుని కాంక్షింపక, నిన్ను దక్క యింకెవ్వరినీ ఆశ్రయింపక, నీ పథమును గాక వేరొండు మార్గము నవలంబింపక, నీతోనే సంభాషించునటుల; నీ ప్రేమకు ముగ్ధుడనై, దివారాత్రములును నిట్టూర్చి, విలపించి, రోదింపుచు "యా బహాఉల్-అభా" యని, కోయిలవలె నినదించునటుల ఆప్తుల, అన్యుల సాన్నిహిత్యము నుండి యొక్క తీరుననే నన్ను విముక్తుని జేసి, నీ ప్రేమతో పరవశు నొనరింపుము.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13748)

ఓ ప్రభూ! ఎంతటి యౌదార్యప్రవాహము ననుగ్రహించితి వీవు, ఎంతటి యనంతానుగ్రహ వెల్లువ నొసంగితి వీవు! ఎల్ల మనమ్ముల నొక్క  హృదయము గావించినావు, అన్ని యాత్మల నొక్క  యాత్మగా ననుసంధానించినావు. నిర్జీవకాయములకు జీవానుభూతుల నిచ్చినావు, విగతదేహము లకు చేతనత్వము నొసగినావు. సకల దయామయుని దినకరప్రసారిత జ్యోతిర్మయూఖములచే యీ మృత్కణములకు  ప్రత్యక్షజీవితము  ననుగ్రహించినావు,  ఏకత్వసంద్రపు టుత్తుంగ తరంగములచే  నీయగణిత బిందువుల నుప్పొంగి, ఘోషించునటు లొనరించినావు. 

 	గడ్డిపోచకు కొండంత బలము నిచ్చి, మంటిమరకచే దీప్తిమత్సూర్యప్రకాశమును ప్రతిఫలింపజేయు ఓ శక్తిశాలీ! మేము నీ దివ్యధర్మమును సేవించుట కుద్యుక్తుల మగునటుల, ప్రపంచజనుల యెదుట లజ్జితులము గాకుండునటుల, నీ మృదుకారుణ్యాను గ్రహములను మాకు ప్రసాదింపుము.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13749)

ఓ సర్వశక్త్యధిపతీ! మేమెల్లరము నీ యధికారవశ్యుల వైునాము. నీవు మా పరిపోషకుడవు, సాహాయ్యుడవు. మాకు నీ మృదుకారుణ్యమును ప్రసాదింపుము, నీ యౌదార్యమును మాకు కటాక్షించి యనుగ్రహద్వారములను వివృత మొనరింపుము, నీ యనుగ్రహాన్విత దృక్కును మాపై సారింపుము. మాపై జీవప్రదాయక పవనమును వీయనిమ్ము, మా వాంఛాతప్త హృదయములను సచేతనముల నొనరింపుము. మా నయనములను శోభిల్లజేసి, మా మనోమందిరమును సమస్త వికాసనికుంజములకును మత్సరహేతువు గావింపుము. ప్రతి యొక్కనినీ పరవశుం జేసి, ప్రతి యాత్మను రంజిల్ల జేయుము.  నీ ప్రాచీనశక్తిని వెల్వరించి, నీ మహాసత్త్వమును ప్రదర్శన మొనరింపుము.  మనుష్యాత్మావిహంగములను నవ్యశిఖరముల కెగయ జేయుము; ఈ మర్త్యప్రపంచస్థితులైన నీ యాంతరంగికులను నీ దివ్యసామ్రాజ్యమర్మముల లోతుల నెఱుగనిమ్ము. మా యడుగులను స్థిరపరచి, దృఢచిత్తములను మా కనుగ్రహింపుము. పాపాత్ములము మేము, నిత్యక్షమాశీలి వీవు. నీ సేవకులము మేము, సార్వభౌముడ వీవు. అగమ్యనిర్వాసితులము మేము, మా శరణ్యాశ్రయము వీవు. నీ మధురపరిమళములను ప్రసరిల్ల జేయుటకును, నీ దివ్యవాక్కును ప్రవృద్ధపరచుటకును దయతో మాకు దోడ్పడి, సాహాయ్యమొనరింపుము. ఉద్వాసితుల స్థానము నుద్ధరింపుము; అభాగ్యుల కనంతైశ్వర్యము ననుగ్రహింపుము. బలహీనులకు నీ బలిమినొసగి, దుర్బలురకు నీ దివ్యశక్తి నిమ్ము. ప్రదాత వీవు,  దయాన్వితుడ వీవు, సమస్తమునేలెడు ప్రభుడ వీవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13750)

ఆయన పరమపావనుడు, మహామహిమాన్వితుడు.
 
	అనుకంపాన్వితుడును, కరుణాన్వితుడునునగు భగవంతుని పేరిట! సకలలోకాధీశుడగు భగవంతుడు ప్రకీర్తితుడు!
 	 ఓ ప్రభూ, నా దేవా, నా ఆశ్రయణమా, నా శరణ్యమా!  ఓ సర్వశక్తిశాలీ, క్షమాశీలీ, నీ సర్వశక్తి చిహ్నములయం దొక్క దానినైనను సంకీర్తించుటకేని, నీచే సృజితమైన దివ్యవాక్కు నొక్కదానిని ప్రస్తుతించుటకేని గావించు యత్నమున వాగ్ధారాన్వితవక్త జిహ్వ తడవడునని, మానుషలేఖిని దైనను, జిహ్వదైనను ప్రతి వ్యక్తీకరణయు కలవరపాటునకు లోనగునని యెఱిగియు, అద్భుత శ్లాఘాన్వితోక్తులతోనైనను, మహాశబ్దచాతురీయుత సంస్తవగీతికలతోనైనను సముచితముగ ని న్నెటుల ప్రస్తుతింప జాలుదును. నీ దివ్యపావిత్య్రత కెగయు ప్రయత్నమున  మానవమేధో విహంగముల పక్షములు భగ్నములైనవి,  తదీయ జ్ఞానమండపపు సర్వోత్కృష్టశిఖరములపై సున్నితములైన తమ గూళ్ల నల్లుటకు వ్యర్ధోహాశాలికలు* శక్తిహీనములు. నా శక్తిహైన్యతను, లోపము లను అంగీకరించుట వినా అన్యధా నాకిక శరణము లేదు, అభాగ్య, అభావముల యగాధముల యందున దక్క నా కావాసమూ లేదు. నిక్కముగా, నిను గ్రహియింప శక్తిహైన్యతయే అవగాహనా తత్త్వము, దోషముల నొప్పుకొనుటయే నీ సాన్నిధ్యసాధనకు యేకైక మార్గము, లేమి నంగీకరించు టయే నిజైశ్వర్య మూలము. 
 	ఓ ప్రభూ!  నీ మహోన్నత సింహద్వార సంసేవనమున నాకునూ, నీ విధేయసేవకులకునూ కృపతో సహకరింపుము; నీ దివ్య పావనతా ప్రార్థనముతో మమ్ము సశక్తీకరింపుము, నీ ఏకేశ్వరత్వ ద్వారము యెదుట వినయవిధేయతలతో మమ్ములను మననిమ్ము.  ఓ నా ప్రభూ, నా యడుగు లను నీ పథమున స్థిరీకరించి, నీ మహిమా స్వర్గశోభిత జ్యోతిర్మయ మయూఖములతో నా మనస్సు నుద్దీపిత మొనరింపుము. నీ క్షమాసహిష్ణుతల స్వర్గవ్యాపిత చైతన్యానిలముతో నా యంతరంగము నుత్తేజిత మొనరింపుము, నీ పవిత్రతా వైుదాన పరివ్యాపిత పునరుజ్జీవన పవనముతో నా యాత్మను సంతసిల్ల జేయుము.  నీ యేకత్వ దిఙ్మండలముపై నా వదనమును శోభిల్లజేసి, నన్ను నీ విధేయసేవకుల యందున గణియింపుము, నీ నిష్ఠాగరిష్ఠ దాసుల యందున పరిగణన మొనరింపుము.
------------------
 * వ్యర్థాలోచనలనే సాలీళ్ళు

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13751)

ఓ ప్రభూ, మా దైవమా! మే మసహాయులము, నీవు శక్త్యధికార వల్లభుడవు. మే మధము లము, నీవు సర్వశక్తిమంతుడవు, సకల మహిమాన్వితుడవు.  మేము దీనులము; నీవు సకల సంపన్నుడవు, మహోదారుడవు.  మాకు నీ పునీత సింహద్వార సంసేవనమున కృపతో సహకరిం పుము;  నీ శక్తిప్రదాయ కానుగ్రహముతో నీ సంస్తవప్రభాత స్థలమున ని న్నారాధింప సాహాయ్య మొనరింపుము. నీ మహాఘన నామము దెసకు సకలదేశములకును దారిని జూపి, నీ మహిమాన్విత ఏకేశ్వరత్వ మహాంబుధి తీరములకు సర్వజనులకును మార్గదర్శన మొనరించునటుల, తదీయ పావనసౌరభములను నీ జీవుల యందున మమ్ము పరివ్యాప్త మొనరింపనిమ్ము, నీ సేవకుల యందున నిన్ను సేవించుటకు మా కటిసీమలను సశక్తీకరింపుము. 

 	ఓ ప్రభూ! నీ దివ్యవాక్కును సంతోషాతిరేకమున సంకీర్తించుట కుద్యమించి, దివారాత్రముల యందునను నీ ప్రస్తుతి నొనరించునటుల; సమస్తప్రజలను మార్గదర్శనపథమున కామంత్రించి, వారిని ధర్మనిరతికి బద్ధుల నొనరించునటుల; నీ సమస్తసృష్టి యందునను నీ యేకేశ్వరత్వ సుభాషితముల నాలపించునటుల - ప్రాపంచిక బంధనముల నుండియు, తత్ప్రజల నుండియు, పూర్వోల్లంఘనల నుండియు, ఇంకను వాటిల్లనున్న సంక్షోభముల నుండియు మమ్ము విముక్తుల నొనరింపుము. నీకు సంప్రీతికరమైన దానిం జేయ శక్తుడవు. నిక్కముగా నీవు సర్వశక్తిశాలివి, మహాధికారయుతుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13752)

ఆయనే దేవుడు
 
	ఓ దయాన్విత ప్రియతమ ప్రభూ! ఈ మిత్రులు దివ్య ఒడంబడి కాసవపరవశులు, నీ యనురాగారణ్య సంచారులు. నీ వియోగాగ్నిజ్వాలకు వారి హృదయము లాహుతి యైనవి, నీ ప్రభాసముల యావిష్కృతికై  యుత్కంఠతో వా రాకాంక్షింపుచున్నారు.  ఆగోచరుని దివ్యలోకమైన నీ యదృశ్యసామ్రాజ్యము నుండి  నీ యనుగ్రహపు సముజ్జ్వల వైభవమును వారల కావిష్కరింపుము. క్షణమున కొక నవ్యాశీస్సు ననుగ్రహించి, నూతనోపకృతిని ప్రసాదింపుము. 

 	ఓ దివ్యవిధాతా! దుర్బలురము మేము, మహాబలాఢ్యుడవు నీవు. చిరుచీమల వంటివారము మేము, విభవలోక రాజన్యుడవు నీవు. మే మొక జ్యోతిని ప్రజ్జ్వలింపజేసి, తత్ప్రభాసమును దూరభూములకు ప్రసరిల్ల జేయునటుల, సత్త్వమును జూపి, యొకింత సేవ జేయునటుల మాకు నీ యనుగ్రహము నొసగి,  నీ యౌదార్యమును ప్రసాదింపుము.  మే మీ తమోభూమికి జ్యోతిస్సును, ఈ నశ్వర మృత్తికా ప్రపంచమున కాధ్యాత్మికతను జేకూర్చునటుల యనుగ్రహింపుము. క్షణమేని మమ్ము విశ్రామము నొందనీయవలదు, ఈ జీవిత క్షణభంగుర విషయకలుషితులను కానీయ వలదు. మేము మార్గదర్శ నాతిధ్యము నేర్పరచి, మా జీవనరుధిరముతో ప్రేమగీతికలను లిఖియించి, భయాందోళనముల నెంచక, ఫలయుత వృక్షసములమై, ఈ నశ్వరప్రపంచమున మానవపరిపూర్ణత లను ప్రదర్శించునటు లొన రింపుము. యథార్థముగ, నీవు సర్వౌదార్యుడవు, అమేయానుకంపాన్వితు డవు, నిత్యక్షమాశీలివి, సహిష్ణుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13753)

ఆయన సకల మహిమాన్వితుడు!
 
	ఓ నా ప్రభూ, నా రాజన్యా, నా ఏలికా, నా సార్వభౌమా! ఈ సేవకుని తదీయ సంరక్షణా చేలముతో, నీ నిత్యసాహాయ్య వస్త్రముతో, నీ సంరక్షణకవచముతో నాచ్ఛాదింపుమని మనసా, వాచా, ఆత్మేణా అర్థింపుచున్నాను. నీ జనులయందున నిన్ను ప్రస్తావించి, నీ సద్గుణములను వక్కాణించి, నీ యేకేశ్వరత్వమును, పావనతను సంకీర్తించుటకై జరిగిన ప్రతి సమ్మేళనమునను నీ శ్లాఘన, ప్రశంసల నొనరించునటుల యీతడి జిహ్వకు స్వేచ్ఛ నిమ్ము. సత్యమునకు, నీవు శక్తిమంతుడవు, బలయుతుడవు, సకలమహిమాన్వితుడవు, స్వయంపరిపోషితుడవు .

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13754)

ఓ నా దయాన్విత ప్రభూ, నా యంతఃకరణాభీష్టమా! నీ మిత్రులకు నీ సాదరకారుణ్యము ననుగ్రహించి, వారికి నీ యమేయ కృపను కటాక్షింపుము. నీ ప్రగాఢప్రేమికులకు సాంత్వనవై, ని న్నపేక్షించు వారలకు హితుడవు, ఆశ్వాసకుడవు, సాదర సహచరుడవు కమ్ము. నీ ప్రేమాగ్నిచే వారి హృదయములు జ్వలియింపుచున్నవి,  నీ యెడ భక్తిజ్వాలచే వారి మనస్సులు దహియింప వడుచున్నవి. మనః పూర్వకముగ తమ ప్రాణముల నర్పించుటకై, నీ యనురాగ బలి పీఠము చెంతకు వా రెల్లరును వేగిరపడ నపేక్షింపుచున్నారు.

 	ఓ దివ్యవిధాతా! వారికి నీ యనుగ్రహము నొసగి, సన్మార్గమున నడిపించు, ఆధ్యాత్మిక విజయసాధనమున వారికి దయతో తోడ్పడు, దివ్యవరములను వారల కొసగు.  ఓ ప్రభూ! వారికి నీ కృపాదాతృత్వములతో సాహాయ్యమొనరించి, వారి మోములను తదీయ జ్ఞానసముపార్జనా సమ్మేళనముల యందున మార్గదర్శన జ్యోతులను,  నీ సుభాషితములు సువిశదములగు సమావేశముల యందున దివ్యౌదార్య చిహ్నములను గావింపుము. నిక్కముగా, నీవు దయామయుడవు, సర్వౌదార్యుడవు, సర్వజన సాహాయ్యాపేక్షితుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13755)

ఆయన సకల మహిమోపేతుడు, మహాతేజోమయుడు.
 
	ఓ దివ్యప్రదాతా! ఓ క్షమాధిపా! నే నెన్నడు యెటుల, సముచితముగ నీ ప్రస్తుతి గావింపగలను, సంపూర్ణముగ ని న్నారాధించి, సంకీర్తింపగలను?  నీ వర్ణనము నేజిహ్వ గావించినను, అది దోషభూయిష్టమే దక్క  వేరొండు కాదు; నీ యభివర్ణనము నేలేఖిని జేసినను, అది యీ దుర్లభకృత్యయత్నమున తద్వైఫల్యతా నిదర్శనమే. జిహ్వ యనునది ధాతునిర్మిత సాధనము దక్క  వేరొండు కాదు, స్వరవాచికములు యాదృచ్ఛిక లక్షణములు దక్క  అన్యములు కావు. ఇక, అనన్యుడును, అద్వితీయుడును నగు ఆయన కీర్తిని ఐహిక స్వరయుత సాధనముతో యేనెటుల సంకీర్తింపగలను? నే ననగలదైనను, అన్వేషించునదైనను మానవమేధకు పరిమిత మైనది, మనుష్య లోకపరిధులచే నావృతమైనది. మానవమేధ దివ్యపావనతా యుత్కృష్ట శిఖరముల నెన్నటికైనను  యెటు లధిరోహింపగలదు,  మిథ్యాభ్రమల శాలిక నునుపగు తన గూడును పవిత్రతా సదనములపై యెవ్విధముగ నల్లగలదు? నా శక్తిహైన్యత నంగీకరించి, నా వైఫల్యము నొప్పుకొనుట దక్క యేమియు చేయజాలను. నిక్కముగా, నీవు సకల సంపన్నుడవు, దుర్లభుడవు, అవగాహనాప్రసాదితుల గ్రాహ్యతాతీత సమున్నతుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13756)

ఓ దివ్యవిధాతా, నిత్యక్షమాశీలి వీవు! ఓ సర్వశక్తియుత దేవా, కృపాన్వితుడ వీవు! నీ విభవచ్ఛాయన యీ ప్రియతమదాసుని మన నిమ్ము,  నీ కారుణ్యప్రాంగణమున యీ నిస్సహాయ నిమ్నుని యెదిగి వర్ధిల్లనిమ్ము. నీ సామీప్యతాచషకము నుండి యీతడిని గ్రోలనిచ్చి, ధన్యవృక్ష చ్ఛాయన వసియింపనిమ్ము. ఈతడికి నీ సాక్షాత్కార భాగ్యమును ప్రసాదించి యనంతానందము నొసంగుము. తన ప్రియజనకుని యడుగుజాడల ననుసరించి, ఆతడి ప్రవర్తనానువర్తనలను సకలజనులకును అభివ్యక్త మొనరించి, నీ పథము ననుసరించి, నీ ప్రమోదము నపేక్షించి, నిన్ను శ్లాఘించుటకు యీ ధన్యజీవి యౌరస సంతతికి కృపతో సహకరింపుము. నీవు నిత్యవాత్సల్య వేలుపువు, వితరణాధీశుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13757)

ఓ నిరుపమాన దైవమా! నీ విధేయభృత్యులము మేము, నిఖిలమహిమాన్వితుడవు నీవు. దుష్కృతులము మేము, నిత్యక్షమాశీలివి నీవు. మేము బానిసలము, దీనులము, నిమ్నులము, మరి నీవు మా శరణువు, సాహాయ్యివి. మేము చిరుచీమల వంటివారమైయుండ, సమున్నత స్వర్గసింహాసనాభిషిక్త మహనీయతాధీశుడవు నీవు. నీదు దయాచిహ్నముగ మమ్ము గావుము, మాకు నీ సంరక్షణా సాహాయ్యముల నుపసంహరింప వలదు. ఓ ప్రభూ! యథార్థమునకు నీ పరీక్షలు తీవ్రతరములు. నీ శోధనలు శిధిల పునాదులను లోహసదృశములను జేయగలవు. మమ్ము కాపాడి, సశక్తీకరింపుము; మా మనస్సులను ప్రమోదానంద భరితములను గావింపుము. నీ పవిత్రసింహద్వార సీమను అబ్దుల్-బహా వలె సేవించుటకు, కృపతో మాకు తోడ్పడుము.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13758)

ఆయనే దేవుడు
 
	ఓ దేవా, నా దేవా! నీ దీప్తిమత్ప్రభాతసమయమున, నీ సంరక్షణాశ్రయమునొంద వేగిరపడి, నీ భద్రసదనమున, సబలదుర్గమున శరణును గోరిన యీ పరివారమునకు సకలాభీష్టశ్రేష్ఠమును, సర్వకార్యోత్తమమును విధియించి, నిఖిలప్రతిష్ఠాపరిపూర్ణతలను,  అనుగ్రహమనోజ్ఞతలను, శ్రేయోమోక్షములను ప్రసాదింపుమని వినయాతిరేకతతో, ఔత్సుక్యతతో, అణకువతో, భక్తితో, మనసా వాచా, మనశ్చేతనలతో,  మేధోమస్తిష్కములతో  నిను వేడుచున్నాడను.  వీరు నిక్కముగా, నీ యాహ్వానము నాలించి, నీ సింహద్వారసీమను సమీపించి, నీ ప్రేమాగ్నిజ్వలితులై, నీ పావన నిగూఢాలాపములకు పరవశులైనారు.  వీరు నీ దివ్యధర్మసేవ యందున సుస్థిరులు, నీ దివ్యానన వినమ్రులు, నీ రక్షణచ్ఛాయోదాత్తులు. ప్రజలలో వారు నీ నామధారులుగ ప్రసిద్ధులై, నీ సేవకులయందున నిన్ను ప్రస్తుతింపుచున్నారు. 
 
	ఓ దేవా, నా దేవా! వారిని నీ సనాతన వైభవముతో సముద్ధరించి, నీ మహత్తరసామ్రాజ్యమున మన్నన జేసి, వారల కీమహనీయ యుగమున నీ యనుగ్రహ సేనాగణములతో దోడ్పడుము.  ఓ ప్రభూ, నా దేవా! నీ బహువిధానుగ్రహదీపికకు గాజుకవచ మగునటుల, నీ సాదరౌదార్యానుగ్రహ వ్యాపకులగునటుల వారి కేతనము నూర్ధ్వీకరించి, వారికి నీ సంరక్షణ యందలి సింహభాగము ననుగ్రహించి, వారి చిహ్నములను సుదూరభూములకు విస్తరించి, వారి తేజమును ప్రవృద్ధ మొనరింపుము.  
 
	ఓ ప్రభూ, నా దేవా! వారికి తమ యొంటరిపాటున సహచరుడవై, వారిని పరితాప తరుణమున నీ సాహాయ్యపరివృతులను జేయుము. వారికి నీ దివ్యగ్రంథమును ప్రసాదించి, పరిపూర్ణముగ నీ పురస్కృతుల ననుగ్రహింపుము. యథార్థముగా, నీవు మహాబలుడవు, శక్తియుతు డవు, కృపాన్వితుడవు, ఔదార్యుడవు; నిక్కముగా నీవు కరుణామయుడవు, అనుకంపాన్వితుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

అబ్దుల్-బహా వెలువరించిన ప్రార్థనలు (#13759)

వితరణాధిక్యమౌ విభుదుడ వీవు
పరిపూర్ణ యాదరణ పాలకుడ వీవు
 
ఉదయాన మనమున కూరట నీవు	
నా కష్టనష్టాల నరయుదు వీవె
 
నీ నివాళి నిమిషం నిలిపిన మనసు
నినుగాక వేరొండు నేస్తమున్ గొనక
ఇష్టాన తనకుతా నిక్కట్లె గోరు 
 
భవదీయ సంస్తుతి భజియింతు మదిని
ముదమున తనకునై ముప్పునే గోరు
 
నినుగని నిట్టూర్ప నిలువగలేని 
హృదయము శుష్కించి ఆరిపో గాక 
 
నినుగని విలపింపనొవ్వని కన్ను 
అవిటిదగుటె మేలు అంతకు మున్ను

తీవ్రతాపమువేళ దీనుని గావు
అఖిలబలుడవంచు అర్ధింతు దేవ
 
ఆద్యంతరహితమై అలరించునట్టి
తేజస్సు నాయందు దేదీప్యమవగ 
 
అర్హతానర్హతల యౌచితి వీడి
దయగల విభుడవు దయజూపు దేవ
 
పక్షము విఱిగిన పక్కి  యెట్లేగు
కరుణించి క్రొత్తది గైజేయమయ్య

-`Abdu'l-Bahá
-----------------------

